assam: నిండా 21 ఏళ్లు లేవు.. కేంద్రాన్నే మోసగించి నాలుగు కోట్లు కొట్టేశాడు!
- కేంద్ర మంత్రిత్వ శాఖలే అతడి లక్ష్యం
- కోట్ల రూపాయలు కొట్టేస్తున్న యువకుడు
- జైలుకెళ్లినా బుద్ధి మార్చుకోని నిందితుడు
నిండా 21 ఏళ్లు లేని అసోం యువకుడు కేంద్ర మంత్రిత్వ శాఖలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇటువంటి నేరంపై అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినా మళ్లీ అటువంటి నేరానికే పాల్పడి మరోమారు అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. లలిత్ దాగర్ పేరుతో ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. తాను చెన్నైలోని కార్మికశాఖలో పే అండ్ అకౌంట్స్ అధికారిగా ఎంపికైనట్టు మెయిల్లో పేర్కొన్న మోసగాడు.. తనకు ఉద్యోగి యూజర్ ఐడీ ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం తన మొబైల్ నంబరుతోపాటు రెండు నకిలీ నియమాకపత్రాలను అటాచ్ చేశాడు.
అవి చూసిన కార్మిక శాఖకు అనుమానం వచ్చింది. అటువంటి పేరుతో ఎటువంటి నియామక పత్రాలు జారీ అవలేదని గుర్తించిన అధికారులు ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అసోంకు చెందిన నూర్ మహ్మద్ అలీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలీ గతంలోనూ ఇటువంటి నేరాలకే పాల్పడి నాలుగు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు. గతంలో వివిధ శాఖలను మోసం చేసి అరెస్ట్ అయిన అలీ.. తాజాగా విడుదలై కార్మిక శాఖను లక్ష్యంగా చేసుకుని మరోమారు పోలీసులకు చిక్కాడు.