Andhra Pradesh: అచ్చెన్నాయుడు ఆ సైజులో ఉన్నాడే తప్ప బుర్ర మాత్రం పెరగలేదు!: సీఎం జగన్ సెటైర్లు
- ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చా కార్యక్రమం
- రైతులను ఆదుకుంటున్నామన్న సీఎం జగన్
- మధ్యలో మాట్లాడేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు
- వయసు పెరిగినా బుర్ర పెరగలేదని జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లో రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఏపీలోని 70 లక్షల మంది రైతులు,కౌలు రైతులకు రూ.8,750 కోట్లు అందించబోతున్నామని వెల్లడించారు. ఈ మొత్తాన్ని బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా నిబంధనలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను తెరిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ‘కరవుపై చర్చ’లో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 50 శాతం మంది రైతులకు ఎకరంన్నర చొప్పున మాత్రమే పొలం ఉందని జగన్ తెలిపారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.2,300 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిందని సీఎం జగన్ విమర్శించారు. గతేడాది నవంబర్ లో విత్తనాల సేకరణ ప్రారంభం కావాలనీ, ఈ ఏడాది ఏప్రిల్ నెలకల్లా పూర్తి కావాలని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేవలం 50,000 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ప్రభుత్వం వద్ద మిగిలాయని చెప్పారు. అధికారులు విత్తనాల సేకరణపై పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా అధికారులు రాసిన లేఖలను సీఎం జగన్ సభలో ప్రదర్శించారు.
ఏపీలో కల్తీ అన్నది లేకుండా, రైతన్నలు నష్టపోకుండా చట్టాలు తెస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సీఎం జగన్ సహనం కోల్పోయారు. ‘అధ్యక్షా.. ఆ మనిషి(అచ్చెన్నాయుడు) ఆ సైజులో ఉన్నాడే కానీ బుర్ర మాత్రం పెరగలేదు అధ్యక్షా. ఏం మాట్లాడుతున్నాడో.. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు.
ఈ పక్క నేను మాట్లాడుతున్నా. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడవచ్చుగా. ఈ పక్కన నేను సభానాయకుడిగా మాట్లాడుతుంటే, పాయింట్ ఆఫ్ ఆర్డర్.. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అదే పనిగా.. ఐదేళ్ల క్రితం మీ సంప్రదాయాన్ని మళ్లీ ప్రతిపక్షంలో పాటించేందుకు, కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరూ ఎప్పటికీ మారరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు వయసు పెరుగుతున్నా బుర్ర మాత్రం పెరగడం లేదని చురకలు అంటించారు.