Uttar Pradesh: కుటుంబసభ్యుల నుంచి ముప్పు ఉందంటూ వీడియో పోస్టు చేసిన ఎమ్మెల్యే కుమార్తె

  • దళితుడ్ని పెళ్లిచేసుకున్న ఎమ్మెల్యే కుమార్తె
  • ఎమ్మెల్యే కుటుంబసభ్యుల విముఖత!
  • వారిద్దరినీ వెతికి పట్టుకునేందుకు ప్రయత్నాలు!
ఉత్తరప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యే కుమార్తె తనకు కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బితారీ చైన్పూర్ శాసనసభ్యుడు, బీజేపీ నేత రాజేశ్ కుమార్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా ఓ దళితుడ్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని కుటుంబసభ్యులు సాక్షిని, ఆమె పెళ్లిచేసుకున్న అజితేశ్ కుమార్ అనే యువకుడ్ని వెతికి పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు సాగించారు. దాంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సాక్షి, తన భర్త అజితేశ్ తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేసింది.

తాము పెళ్లిచేసుకున్నందున ఇక తమ జోలికి రావద్దని, ఒకవేళ తనకు గానీ, తన భర్తకు గానీ, తన భర్త కుటుంబ సభ్యులకు గానీ ఏదైనా హాని జరిగితే అందుకు తన తండ్రి రాజేశ్ కుమార్ మిశ్రా, ఆయన అనుచరుడు రాజీవ్ రాణాలదే బాధ్యత అని సాక్షి హెచ్చరించింది. ఈ విషయంలో తన తండ్రికి ఏ రాజకీయనాయకుడు మద్దతు తెలపవద్దని కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన డీఐజీ ఆర్కే పాండే ఎమ్మెల్యే తనయ సాక్షికి, ఆమె భర్తకు రక్షణ ఇవ్వాల్సిందిగా స్థానిక పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

Uttar Pradesh
MLA
Police
Video
Social Media

More Telugu News