Nagarjuna School: పాత బస్సుకు రంగులేసి స్కూలు యజమానికి అంటగట్టిన షోరూం!
- బస్సును కొనుగోలు చేసిన నాగార్జున స్కూలు యజమాని
- మంచి రోజని పూజ చేయిద్దామంటే మొరాయించిన బస్సు
- పాత బస్సుకు రంగులు వేసి అమ్మారని తేల్చిన మెకానిక్
రూ.15 లక్షలతో ఓ పేరున్న బ్రాండ్ కంపెనీ బస్సును కొనుగోలు చేసిన స్కూలు యాజమాన్యం అవాక్కవడానికి ఎంతో సమయం పట్టలేదు. మంచి రోజు కదా.. పూజ చేయిద్దామని బస్సును తీసుకెళితే, ఎంతకీ స్టార్ట్ అవకుండా మొరాయించింది. దీంతో మెకానిక్ ను పిలిచి చూపించగా, స్కూలు యాజమాన్యానికి దిమ్మతిరిగినంత పనైంది. మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలానికి చెందిన నాగార్జున స్కూల్ యజమాని రవి పిల్లల రవాణా కోసం మహబూబాబాద్‌లో ఓ షోరూంలో బస్సు కొన్నారు.
ముందుగా రూ.2 లక్షల 14 వేలు చెల్లించి మిగిలిన డబ్బును ఈఎంఐల ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేసుకున్నారు. నేడు మంచి రోజని పూజ చేయించేందుకు సిద్ధమవ్వగా బస్సు మొరాయించింది. దీంతో మెకానిక్ ను పిలిచి చూపించగా, దానిని పరిశీలించి పాత బస్సుకు కొత్త కలర్ వేసి అమ్మారని తేల్చాడు. దీంతో షాక్ అయిన స్కూలు యజమాని షోరూం నిర్వాహకులను నిలదీశారు. అయితే తాము వరంగల్ షో రూం నుంచి బస్సును తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. దీంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.