Rental Act: కొత్త అద్దె చట్టం వస్తోంది.. అందరికీ లాభమే!
- అద్దెకుండేవారి ప్రయోజనాలను కాపాడేలా చట్టం
- రెండు నెలలకు మించి అడ్వాన్స్ కుదరదు
- ఆగస్టు 1 వరకూ అభిప్రాయ సేకరణ
అద్దె ఇళ్లల్లో ఉండేవారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కీలక అడుగు వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతన చట్టం తయారైంది. ప్రస్తుతం ప్రతిపాదనల రూపంలో ఈ చట్టం ఉండగా, అద్దె ఇళ్లకు సెక్యూరిటీ డిపాజిట్ రెండు నెలలకు మించి వసూలు చేయకూడదు. ఈ మేరకు ముసాయిదా నిబంధనలను తయారు చేసిన కేంద్రం, ప్రజల అభిప్రాయాలను కోరుతోంది.
వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, అసంఘటిత కార్మికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు మేలు కలిగేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన అద్దె విధానాన్ని అమలు చేసినట్టుగానూ అవుతుందని, అద్దె ఇళ్ల కొరతను నివారించవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న చట్టం యజమానులను భయపెట్టేలా ఉండటంతోనే, దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అభిప్రాయపడుతున్న కేంద్రం చట్టాన్ని మార్చాలని సంకల్పించింది.
ఇక ముసాయిదా చట్టంలోని ఇతర అంశాలను పరిశీలిస్తే, లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఎవరూ ఇళ్లను అద్దెకు ఇవ్వడం, తీసుకోవడం కుదరదు. ఇక అద్దె ఒప్పందం కుదిరిన రెండు నెలల్లోపు దాన్ని రెంట్ అథారిటీకి అందించి, విశిష్ట గుర్తింపును తీసుకోవాలి. ఒప్పంద పత్రాలను సమర్పించేందుకు స్థానిక భాషల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేస్తారు. మొత్తం ముసాయిదాను ఆన్ లైన్ లో ఉంచామని, ఎవరైనా తమ అభిప్రాయాలను ఆగస్టు 1లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.