Uttar Pradesh: ఎ ఫర్ ఆల్కహాల్.. బి ఫర్ బీడీ.. మనవళ్లకు చదువుతోపాటు తాగుడు నేర్పిస్తున్న తాత!
- చిన్నారులకు శ్రద్ధగా తాగుడు నేర్పిస్తున్న వృద్ధుడు
- బీడీ ఎలా వెలిగించాలో వివరించిన తాత
- వృద్ధుడిపై చర్యలు తప్పవన్న పోలీసులు
ఎ ఫర్ ఆపిల్.. బి ఫర్ బోయ్.. పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పదాలు. కానీ ఓ తాత తన మనవళ్లకు దీనిని కాస్త కొత్తగా నేర్పిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఎ ఫర్ ఆల్కహాల్, బి ఫర్ బీడీ అని నేర్పించడమే కాకుండా అవి ఎలా తాగాలో కూడా వివరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బహదూర్‌పూర్‌లో జరిగిందీ ఘటన.
ఓ మంచంపై తన ఇద్దరు మనవళ్లతో కలిసి కూర్చున్న వృద్ధుడు వారికి డిస్పోజబుల్ గ్లాసులో మద్యాన్ని ఎలా పోయాలి? పోశాక ఎలా తాగాలి? బీడీ ఎలా వెలిగించి కాల్చాలి వంటి వాటిని చక్కగా వివరించాడు. చుట్టుపక్కల గుమిగూడిన కొందరు దీనిని ఆసక్తిగా తిలకిస్తుండడం విశేషం. అలా గుమిగూడిన వారిలో ఓ కాంట్రాక్ట్ టీచర్ కూడా ఉండడం గమనార్హం.
గ్లాసులో మద్యం పోశాక అందులో నీళ్లు కలిపిన అనంతరం చిన్నారులకు ఇచ్చిన వృద్ధుడు తాగమని చెప్పాడు. ఈ మొత్తం తతంగాన్ని ఫోన్‌లో చిత్రీకరిస్తున్న మరో వ్యక్తి.. తానైతే నిమిషంలో గ్లాసును ఖాళీ చేస్తానని చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. మరో వ్యక్తి గ్లాసులో బీరు పోసి దానిని జ్యూస్‌గా చెబుతూ తాగమని పిల్లలను బలవంతం చేస్తున్నాడు. అక్కడితో ఆగని వృద్ధుడు బీడీ వెలిగించి దానిని ఎలా కాల్చాలో పిల్లలకు వివరించాడు. సగం కాల్చిన బీడీని ఓ బాలుడికి ఇచ్చి ఎలా పట్టుకుని తాగాలో చెప్పాడు. ఓ చిన్నారి తాగాక దానిని మరో బాలుడికి ఇచ్చి అతడికి కూడా అలానే నేర్పించాడు.
వీడియో వైరల్ అయి పోలీసులకు చేరడంతో స్పందించారు. వృద్ధుడితోపాటు అతడి చుట్టూ నిల్చుని జాగ్రత్తగా వింటున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అలీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మణిలాల్ పటీదార్ తెలిపారు.