Kanipakam: కాణిపాకం స్వర్ణ ధ్వజస్తంభం వద్ద ప్రేయసి మెడలో తాళికట్టబోయిన ప్రియుడు... జరిమానా విధించిన అధికారులు!
- ప్రేయసిని తీసుకుని ఆలయానికి వచ్చిన యువకుడు
- పెళ్లి ఎక్కడ చేసుకోవాలో తెలియక ఆలయంలోనే తాళి కట్టేందుకు సిద్ధం
- రూ. 2,116 జరిమానా విధించిన అధికారులు
కాణిపాకంలోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తన ప్రేయసికి తాళి కట్టాలని ప్రయత్నించి కష్టాల్లో పడ్డాడో యువకుడు. గడచిన రెండు దశాబ్దాలుగా కాణిపాకం ప్రధాన ఆలయంలో వివాహాలు జరగరాదన్న నిబంధనను అమలు చేస్తుండగా, దాన్ని ఉల్లంఘించాడన్న ఆరోపణలపై సదరు యువకుడికి జరిమానా విధించి పంపారు.
వివరాల్లోకి వెళితే, తమిళనాడు, కాట్పాడి జిల్లాకు చెందిన ఓ జంట వివాహం నిమిత్తం ఆలయానికి వచ్చింది. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో తెలియని వారు, ఆలయంలోని స్వర్ణ ధ్వజస్తంభం ఎదుటే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. తాళి కట్టేందుకు రెడీ అయిన యువకుడిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని, ఆలయ అధికారులకు చెప్పి, పోలీసులకు సమాచారాన్ని అందించారు.
కాణిపాకంలో వివాహం చేసుకోవాలంటే, పెద్దలతో సహా వచ్చి, రిజిస్ర్టేషన్ చేసుకుని, కల్యాణ మండపాల్లోనే పెళ్లాడాలని తేల్చి చెప్పిన అధికారులు, వారికి రూ. 2116 జరిమానా విధించారు. దీంతో సదరు ప్రియుడు ఆ జరిమానా చెల్లించి, తన ప్రేయసిని తీసుకుని వెళ్లిపోయాడు.