CBI: సోనియా గాంధీ సన్నిహితురాలు ఇందిరా జైసింగ్ ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు
- యూపీఏ హయాంలో ఏఎస్‌గా నియామకం
- ఆమె స్వచ్ఛంద సంస్థపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు
- సీబీఐ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం
ప్రముఖ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ నివాసాలతోపాటు, వారి ఆధ్వర్యంలోని ‘లాయర్స్ కలెక్టివ్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. వీరు స్థాపించిన ‘లాయర్స్ కలెక్టివ్’ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ నిధులు సేకరిస్తోందంటూ గత నెలలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా, గురువారం ఐదు గంటల నుంచే ఢిల్లీలోని వారి నివాసం, కార్యాలయం, జంగ్‌పురాలోని లాయర్స్ కలెక్టివ్ కార్యాలయం, ముంబైలోని కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేసింది.
లాయర్స్ కలెక్టివ్ సంస్థ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించిందంటూ కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసింది. 2006-07, 2014-15 సంవత్సరాల మధ్య కాలంలో విదేశాల నుంచి రూ.32.39 కోట్లకుపైగా నిధులను సేకరించి దుర్వినియోగం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో లాయర్స్ కలెక్టివ్, దాని అధ్యక్షుడైన ఆనంద్ గ్రోవర్‌తోపాటు గుర్తు తెలియని ఆఫీసు బేరర్లు, గుర్తు తెలియని అధికారులపై కేసు నమోదు చేసింది. తాజాగా నిర్వహించిన దాడుల్లో కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
సోనియా గాంధీకి ఇందిరా జైసింగ్ సన్నిహితురాలు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆమెను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించారు. దేశానికి తొలి మహిళా ఏఎస్జీగా ఇందిర రికార్డులకెక్కారు. అయితే, మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇందిరపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2016లో లాయర్స్ కలెక్టివ్‌కు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తనపై వస్తున్న ఆరోపణపై ఇందిరా జైసింగ్ స్పందించారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఖండించారు. సుప్రీం సీజేపై మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును తాను చేపట్టడంతో కక్ష సాధించేందుకే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.