Tamil Nadu: కొనసాగుతున్న చెన్నైవాసుల తాగునీటి ఇక్కట్లు.. రైలు వ్యాగన్లతో నీరు తరలించాలని నిర్ణయం
- వేలూరు జిల్లా జాలార్ పేట నుంచి నీరు
- విల్లివక్కమ్ రైల్వేస్టేషన్‌కు తొలి రైలు
- రూ.65 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం మంచినీటి సమస్య నుంచి ఇంకా బయటపడ లేదు. మూడు నెలల నుంచి నగర వాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉండగా తాజాగా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం రైలు వ్యాగన్ల ద్వారా నీటిని నగరానికి తరలించాలని నిర్ణయించింది. నగర జనాభా అవసరాలు తీర్చేందుకు వేలూరు జిల్లాలోని జాలార్పేట వనరుల నుంచి నీటి తరలింపునకు ప్రభుత్వం 65 కోట్ల రూపాయలు విడుదల చేసింది. చెన్నై నగరానికి రోజుకి కోటి లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం రోజుకి వ్యాగన్ల ద్వారా 25 లక్షల లీటర్ల నీటిని నగరానికి తరలించాలని నిర్ణయించారు. తొలి రైలు విల్లివక్కమ్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. రైలు చేరగానే నీటి కోసం తొక్కిసలాట జరగకుండా పోలీసులు అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.