Andhra Pradesh: ఒక్కసారి రికార్డులు తిరగేయండి.. రౌడీలు ఎవరో, హంతకులు ఎవరో తెలుస్తుంది!: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
- జగన్ శాడిజంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు
- అవినీతితో పైకొచ్చిన నాయకులే అబద్ధాలు చెబుతారు
- మీడియా పాయింట్ లో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య
అనుభవ రాహిత్యం, హడావుడిలో నిన్న సీఎం జగన్ తమకు సవాల్ విసిరారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. కానీ ఈరోజు.. రైతులకు సున్నా వడ్డీ పథకం కింద టీడీపీ ప్రభుత్వం రూ.640 కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఎవరు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఎవరు క్షమాపణ చెప్పాలో తేలాల్సి ఉందన్నారు. టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడారు.
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యాక్షనిజంతో, శాడిజంతో కూడుకున్న నిర్ణయాల్లాగే అనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ‘మేం 151 మంది ఉన్నాం. మీ సంగతి చూస్తాం. చేతులు విరుస్తాం. మీరు ఇక్కడ ఉంటారా? అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి చేతులు ఎవరు విరుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. మాట తప్పం-మడమ తిప్పం అన్న ముఖ్యమంత్రి ఈరోజు అన్నీ అబద్ధాలే చెబుతున్నాడు. నాయకులు సచ్ఛీలురైతే నిజాలు చెబుతారు.
అవినీతి ద్వారా పైకొచ్చిన నాయకులే అబద్ధాలు చెబుతారు. అధికార పక్ష సభ్యులే పోడియంలోకి దూసుకొచ్చి సభను వాయిదా వేయించారు. మాట తప్పని-మడమ తిప్పని ముఖ్యమంత్రికి రక్షణగా సభను వాయిదా వేయించారు. మేం రౌడీలమని జగన్ అన్నారు. మేమేమన్నా రౌడీలమా? ఓసారి రికార్డులు తిప్పి చూస్తే రౌడీలు ఎవరో, హంతకులు ఎవరో తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి.’ అని సీఎం జగన్ కు హితవు పలికారు.