KTR: కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు మాధవి
- ట్విట్టర్ లో స్పందించే పిట్ట కేటీఆర్
- 9 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం స్పందించలేదు
- చట్టాలలో కాదు.. కేసీఆర్ లో మార్పు రావాలి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు ఇచ్చే విలువ ప్రజలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 'ట్విట్టర్ లో స్పందించే పిట్ట కేటీఆర్' అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే మున్సిపల్ చట్టం తెస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 6 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలనే లేదని విమర్శించారు. 9 నెలల పాపపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. వర్షం కురిస్తే హైదరాబాద్ జలమయం అవుతోందని అన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని మాధవి విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 100 రోజుల ప్రణాళికలో మున్సిపాలిటీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలలో మార్పు కాదని... ముఖ్యమంత్రి కేసీఆర్ లో మార్పు రావాలని అన్నారు. వార్డులను శాస్త్రీయత లేకుండా విభజిస్తున్నారని... ఇది కేసీఆర్ పిరికితనాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలను బీజేపీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుందని చెప్పారు.