tv9: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
- వారానికి ఓరోజు పోలీసుల ముందు హాజరుకావాలి
- చెప్పకుండా దేశం విడిచిపెట్టి పోకూడదు
- రవిప్రకాశ్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు ఊరట లభించింది. టీవీ9 కంపెనీకి సీఈవోగా ఉన్న సమయంలో ఫోర్జరీ, నిధుల మళ్లింపునకు పాల్పడ్డ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఓరోజు పోలీసుల ముందు హాజరుకావాలనీ, విచారణకు సహకరించాలని సూచించింది.
తమ అనుమతి లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించింది. ఈ కేసులో బెయిల్ కోసం గతంలో రవిప్రకాశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆర్థికనేరానికి సంబంధించిన కేసు అయినందున న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ హైకోర్టును ఆయన ఆశ్రయించడంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. రవిప్రకాశ్ ఫోర్జరీతో పాటు మోసానికి పాల్పడ్డారని టీవీ9 యాజమాన్యం అలందా మీడియా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాశ్ పై కేసు నమోదయింది.