World Cup: ప్రపంచకప్ ఫైనల్ కు ముందు విచిత్రమైన పరిస్థితి!
- ఫైనల్లో భారత్ ఆడుతుందని అంచనా వేసిన ఫ్యాన్స్
- టైటిల్ పోరుకు భారీగా టికెట్లు కొనేసిన టీమిండియా అభిమానులు
- సెమీస్ లో ఇంటిముఖం పట్టిన భారత్
ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. లీగ్ దశలో అమోఘమైన రీతిలో ప్రదర్శన చేసిన జట్టు సెమీస్ లో న్యూజిలాండ్ వంటి జట్టు చేతిలో ఓడిపోతుందని ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించలేదు. కానీ, కివీస్ అనూహ్యంగా భారత్ ను ఓడించి ఫైనల్ చేరింది. మరోవైపు, ఆతిథ్య ఇంగ్లాండ్ కూడా ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. అయితే, వరల్డ్ కప్ నిర్వాహకుల ముందు ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి నిలిచింది.
లీగ్ దశలో టీమిండియా ఊపు చూసిన అభిమానులు కచ్చితంగా ఫైనల్ చేరుతుందని భావించి జూలై 14న జరిగే టైటిల్ పోరుకు టికెట్లు భారీగా కొనేశారు. అంతిమ సమరానికి ఆతిథ్యమిస్తున్న లార్డ్స్ స్టేడియంలో 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొనుగోలు చేశారు. కానీ భారత్ సెమీస్ లోనే వెనుదిరగడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఫైనల్లో భారత్ ను చూడాలని భావించిన వాళ్లు, ఇప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం ఆడుతుంటే స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్ చూస్తారని ఎవరూ భావించడంలేదు.
ఈ నేపథ్యంలో, ఐసీసీ వెబ్ సైట్ లో భారీగా టికెట్ రీసేలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకైతే రీసేల్ విభాగంలో ట్రాఫిక్ తక్కువగానే ఉందని, కానీ రీసేల్ లో టికెట్లు కొనాలని కోరుకుంటున్నవాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతోందని ఐసీసీ వర్గాలంటున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆడుతున్నా ఆ రెండు జట్ల అభిమానులకు టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. టీమిండియా అభిమానులు తమ వద్ద ఉన్న టికెట్లు అమ్మకానికి పెడితే తప్ప ఇంగ్లాండ్, కివీస్ ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ చూసే అవకాశం లభించకపోవచ్చు.