Kerala: మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళితే మళ్లీ పెళ్లిచేసుకోమని చెప్పిన ప్రబుద్ధులు... వేటు వేసిన కేరళ మంత్రి
- సర్టిఫికేట్ కోసం తిప్పించుకున్న రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది
- తన బాధను సోషల్ మీడియాలో వెళ్లగక్కిన బాధితుడు
- శాఖాపరమైన విచారణ నిర్వహించిన మంత్రి
కేరళలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యపూరిత ధోరణి చర్చనీయాంశంగా మారింది. మధుసూదన్ అనే వ్యక్తి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటూ కోజికోడ్ జిల్లా ముక్కోమ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. 2003 ఫిబ్రవరి 27న తనకు పెళ్లయిందని, ఇప్పుడు సర్టిఫికెట్ తో అవసరం ఉందని చెప్పాడు. వాస్తవానికి దరఖాస్తు చేసుకున్న రోజే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నా, అధికారులు మధుసూదన్ ను కాళ్లరిగేలా తిప్పించుకున్నారు. ఇదేంటని గట్టిగా నిలదీస్తే, మళ్లీ పెళ్లి చేసుకో, సర్టిఫికెట్ ఇచ్చేస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
దాంతో ఒళ్లు మండిన ఆ వ్యక్తి సోషల్ మీడియాలో అధికారుల తీరును విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖ వరకు వెళ్లడంతో, శాఖాపరమైన విచారణ జరిపి సదరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం నలుగురిపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించారు. ఈ వివరాలను కేరళ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి జి.సుధాకరన్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.