Chandrababu: తలసరి ఆదాయం ఆనాడు రూ.6 వేలే ఎక్కువ... ఇప్పుడు రూ.38 వేలు పెరిగింది... ఇది టీడీపీ ఘనత కాదా?: బడ్జెట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
- బడ్జెట్ పై పెదవి విరిచిన చంద్రబాబు
- ముందు చూపులేని బడ్జెట్ అంటూ విమర్శలు
- నిధుల కేటాయింపులో కోతలు పెట్టారంటూ అసంతృప్తి
ఏపీ ప్రభుత్వం ఇవాళ సమర్పించిన బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. 2014లో ఏపీ ప్రజల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6 వేలే ఎక్కువ అని, ఇప్పుడది రూ.38 వేలను మించిపోయిందని, ఈ ఘనత టీడీపీ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పే మాటలు ఒకలా ఉంటాయని, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. అందుకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో ఒక రకంగా చెప్పి, బడ్జెట్ లో మరో రకంగా పేర్కొనడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.
సున్నా వడ్డీ రుణాలకు రూ.4000 కోట్లు అవసరమైతే రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. పైగా ప్రగతికి ఎంతో ముఖ్యమైన ప్రాజక్టుల కేటాయింపుల్లో 22 శాతం కోత పెట్టడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా పొరుగురాష్ట్రంలో నీళ్లు పారించేందుకే ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. ఇది ముందుచూపులేని బడ్జెట్ అని విపక్ష నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.