Crime News: నేనేరా పోలీస్ అంటూ దబాయింపు...వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
- ఓ ఆటో డ్రైవర్ సంపాదన మార్గమిది
- బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో నిఘా పెట్టిన పోలీసులు
- అరెస్టు చేసి జైలుకి తరలింపు
వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని పోలీసునంటూ బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తమ పేరు చెప్పుకుని మోసాలకు తెరలేపిన అతని ఆగడాలకు ఫుల్స్టాప్ పెట్టారు. హైదరాబాద్ ఎల్.బి.నగర్ ఠానా పరిధిలో జరిగిన ఈ దోపిడీలకు సంబంధించి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించిన వివరాలు ఇలావున్నాయి. అతనో ఆటో డ్రైవర్. నగలు దోచుకున్న ఘటనలో ఓసారి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. సులువుగా సంపాదనకు అదే మంచిమార్గంగా భావించి జైలు నుంచి రాగానే మళ్లీ అదే మార్గాన్ని ఎన్నుకున్నాడు. కాకపోతే కొంచెం స్టైల్ మార్చాడు. బస్టాప్ల్లోను, ఇతర ప్రాంతాల్లోను మెడలో నిండుగా నగలున్న వృద్ధులే లక్ష్యంగా తన దోపిడీలకు తెరలేపాడు.
బస్టాప్‌లో నిల్చున్న వారి వద్దకు ద్విచక్ర వాహనంపై వస్తాడు. తాను పోలీసునని, ఓ కేసు విచారణకు సంబంధించి మిమ్మల్ని విచారించాల్సి ఉన్నందున స్టేషన్‌కు రావాలంటూ బెదిరిస్తాడు. ఏం కేసో...తమను ఎందుకు విచారించాలో అర్థంకాని ఆ వృద్ధులు పోలీసులతో ఎందుకొచ్చిన తంటా అని రావడానికి సిద్ధపడితే చాలు 'ఒంటిపై అంత బంగారంతో స్టేషన్‌కు ఎందుకు? తీసి మూటకట్టు’ అంటూ హుకుంజారీ చేస్తాడు. ఆటోను పిలిచి ఎక్కిస్తాడు. బంగారం మూట తను తీసుకుని వారితోపాటు బయలుదేరుతాడు.
దారి మధ్యలోనే ఆటోను ఆపి, 'సరేలే...మీరు విచారణకు రావక్కర్లేదు’ అంటూ బంగారం మూట వారికి ఇచ్చేస్తాడు. హమ్మయ్య...కేసు తప్పింది అని బతుకు జీవుడా అని ఇచ్చిన మూట పట్టుకుని వెళ్లిపోయిన వృద్ధులకు ఆ తర్వాతగాని అసలు విషయం తెలియదు. దారి మధ్యలోనో, ఇంటికి వెళ్లో మూట విప్పి చూస్తే అందులో ఉండాల్సిన నగలు అన్నీ ఉండవు. సగం వరకు మాయం అవుతాయి. ఆ తర్వాత లబోదిబో మంటూ వెతికినా అతని జాడ మాత్రం కనిపించదు.
దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు బావురుమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే. ఇలా ఇతని బారిన పడిన వారిలో పలువురు విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడు దోపిడీలకు పాల్పడిన పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీ పరిశీలించి అతన్ని గుర్తించారు. అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారం, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.