Something Special: నా ఒళ్లు బంగారంగాను...ప్రశాంత సప్కల్ స్పెషాలిటీ ఇది
- ఒంటిపై ఆభరణాలు ఐదు కిలోల పైమాటే
- సంగీత దర్శకుడు బప్పీ లహరి ఆదర్శం
- అదే దారిలో ఈ పుణే యువ వ్యాపారవేత్త
అతనో యువ వ్యాపారవేత్త. ఆయనగారికి బంగారం అంటే మహామోజు. ఈ విషయంలో తనకు బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి ఆదర్శం అంటాడాయన. అందుకే ఒంటిపై ఏకంగా ఐదు కేజీల బంగారు ఆభరణాలతో నిత్యం మెరిసిపోతుంటాడు. మెడలో గొలుసేకాదు, కాలికి వేసుకునే బూట్లు కూడా బంగారంవే కావడం ఆయన స్పెషాలిటీ.
పుణెకు చెందిన ప్రశాంత్ సప్కల్ యువ వ్యాపారవేత్త. బప్పీ లహరి ఒంటిపై భారీగా బంగారంతో కనిపిస్తుంటే బాల్యంలోనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. జీవితంలో స్థిరపడ్డాక తనూ అలాగే ధరించాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే వ్యాపారంలో రాణించడంతో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న భారీ గొలుసు, బ్రేస్ లెట్, కడియం, ఉంగరాలు, ఫోన్ బ్యాక్ కవర్...ఇలా ఒకటేమిటి కాలికి వేసుకునే బూట్లు కూడా బంగారంతోనే తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం దాదాపు ఐదు కిలోల బంగారం వినియోగించారు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.5 కోట్లు పైమాటే. తన అభిరుచికి తగ్గట్టు చేయించుకున్న ఆభరణాలను ప్రశాంత్ ప్రతిరోజూ ధరిస్తున్నాడు. ప్రస్తుతం ఇతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.