China: మన భూభాగంలోకి చైనా సైన్యం చొరబడలేదు: ఆర్మీ చీఫ్
- డెంచోక్ సెక్టార్ లో చైనా సైనికులు చొరబడ్డారంటూ వార్తలు
- సైనిక చొరబాటు జరగలేదన్న బిపిన్ రావత్
- బోర్డర్ లో పరిస్థితి సాధారణంగా ఉందంటూ వ్యాఖ్య
మన భూభాగమైన లడక్ లోని డెంచోక్ సెక్టార్ లోకి చైనా సైనికులు చొరబడ్డారంటూ వచ్చిన వార్తలను భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ ఖండించారు. అలాంటిదేమీ లేదని అన్నారు. బౌద్ధ మత గురువు దలైలామా జన్మదినం సందర్భంగా కొందరు టిబెటన్లు టిబెట్ జెండాలను ఎగురవేసిన తర్వాత నియంత్రణ రేఖను చైనా సైనికులు దాటారనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై రావత్ మాట్లాడుతూ, నియంత్రణ రేఖ వద్దకు కొందరు చైనీయులు వచ్చారని... వారిని మనం అడ్డుకున్నామని చెప్పారు. మన భూభాగంలో నివసిస్తున్న మన టిబెటన్లు వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఏం జరుగుతోందో చూద్దామనే కుతూహలంతో చైనీయులు వచ్చారని చెప్పారు. అంతేకాని, సైనిక చొరబాటు జరగలేదని తెలిపారు. బోర్డర్ లో పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు.