Police: వింత దొంగ... జైలు తిండి రుచిమరిగి పోలీసులకు దొరికిపోయేలా దొంగతనాలు!
- కుటుంబ సభ్యుల నిరాదరణ
- జైలు జీవితానికి అలవాటుపడిన గణన ప్రకాశం
- సీసీ కెమెరాలకు ముఖం చూపించి మరీ చోరీలు
ఎవరైనా డబ్బు కోసం చోరీలు చేస్తారు. కానీ తమిళనాడుకు చెందిన గణన ప్రకాశం మాత్రం జైలు తిండి, అక్కడి వాతావరణం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. బయట ఉంటే తిండి దొరకదన్న బెంగ ఉంటుందేమో కానీ, జైల్లో ఉంటే మూడు పూటలా వేళకు భోజనం పెడతారని ఈ వింతదొంగ ఫిక్సయిపోయాడు. అందుకే జైలుకు వెళ్లడానికే చోరీలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు.
గణన ప్రకాశం వయసు 52 సంవత్సరాలు. మొదటిసారి ఈ ఏడాది మార్చిలో ఓ చోరీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు. అక్కడి ఖైదీల స్నేహపూర్వక ధోరణి, ముఖ్యంగా జైలు రుచులు బాగా ఆకట్టుకున్నాయి. సొంత ఇంటి కంటే జైలే బాగుందనిపించింది. జూన్ లో బెయిల్ పై బయటికొచ్చినా జైలు వాతావరణాన్ని మాత్రం మర్చిపోలేకపోయాడు. దాంతో, మళ్లీ ఓ దొంగతనం చేసి జైలుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
చెన్నై సిటీలోని కైలాసపురం ప్రాంతంలో బైకులు చోరీ చేయడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ముఖం కనిపించేలా వెళ్లిపోవడం చేసేవాడు. అయితే, తాను చోరీ చేసిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో నిలిచి ఉంచిన ఓ బైకు నుంచి పెట్రోల్ తస్కరిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకు పెట్రోల్ దొంగిలిస్తున్నావు అని పోలీసులు అడిగితే, తాను పెట్రోల్ మాత్రమే కాదని, బైకులు కూడా చోరీ చేస్తున్నానని చెప్పేశాడు. వీడేంటి, విచారణ లేకుండానే అన్నీ కక్కేస్తున్నాడని ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ తర్వాత ప్రకాశం చెప్పింది విని మరింత షాక్ తిన్నారు.
జైలు జీవితం కోసమే తాను చోరీలు చేస్తున్నట్టు చెప్పడంతో అవాక్కయ్యారు. దీనిపై ఏసీపీ వివరణ ఇచ్చారు. ప్రకాశానికి కుటుంబ సభ్యుల నిరాదరణ చాలా మనస్తాపం కలిగించిందని, జైలు అతడికి సొంత ఇల్లులా అనిపించిందని తెలిపారు. ఇతర ఖైదీలతో స్నేహం ఏర్పడడం, వేళకు మంచి భోజనం పెట్టడం ప్రకాశాన్ని బాగా ఆకర్షించిందని వెల్లడించారు.