Pakistan: పాకిస్థాన్ మంత్రిని అభాసుపాలు చేసిన వీడియో గేమ్!
- జీటీఏ వీడియోగేమ్ లో ఫ్లయిట్ ల్యాండింగ్ సీన్
- నిజంగానే విమాన ప్రమాదం తప్పిందనుకుని భ్రమపడిన మంత్రి
- పైలట్ అద్భుతం చేశాడంటూ కితాబు
ఇటీవల కాలంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సహా ఇతర మంత్రులు వెర్రివెంగళప్పలను తలపిస్తున్నారు. వాళ్లు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. తాజాగా, ఖుర్రమ్ నవాజ్ గందాపూర్ అనే పాకిస్థాన్ మంత్రివర్యులు ఓ వీడియో గేమ్ లో కనిపించిన దృశ్యాన్ని నిజమే అనుకుని భ్రమించాడు.
ఇంతకీ ఆ దృశ్యం ఏంటంటే, ఓ భారీ విమానం ల్యాండయ్యే సమయంలో రన్ వేపై పెద్ద ట్రక్ అడ్డొస్తుంది. ఆ ట్రక్కుకు ఆపద వాటిల్లకుండా విమానాన్ని పైలట్ అత్యంత చాకచక్యంగా కిందికి దించుతాడు. ఇది నిజమైన ఘటనే అనుకున్న ఖుర్రమ్ మహాశయుడు ఓ ఘోరం తప్పిపోయిందంటూ హడావుడిగా ట్వీట్ చేశాడు. "తృటిలో ఎంతపెద్ద ప్రమాదం తప్పింది! పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించబట్టి విపత్తు తొలగిపోయింది. ఆ పైలట్ ఎవరో కానీ అద్భుతం చేశాడు" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
ఇది చూసి ట్విట్టర్ జనాలు నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ సీన్ జీటీఏ-5 అనే వీడియో గేమ్ లోని ఓ యాక్షన్ పార్ట్. ఆ విషయం తెలియని పాకిస్థాన్ మంత్రి తొందరపడి ట్వీట్ చేసి నవ్వులపాలయ్యారు.