India: ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ రైల్... విశేషాలు వింటే 'ఔరా' అనాల్సిందే!
- ఢిల్లీ - లక్నోల మధ్య నడిచే తేజస్
- త్వరలోనే ప్రైవేటు సంస్థకు అప్పగింత
- ప్రయాణికులకు సకల సౌకర్యాలు
రెండు రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఢిల్లీ - లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రైవేటు సంస్థల అధీనంలోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ రైలు ఆనంద్ నగర్ స్టేషన్ లో ఉండగా, త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసి, రైలును ఎవరికి కాంట్రాక్టుకు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ రైలులో ఎన్నో అద్భుతాలు ఉంటాయి.
ప్రతి సీటు వెనుకా ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఇష్టమైన సినిమాలను, టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. దీంతో పాటు వైఫై, మొబైల్ చార్జింగ్ పాయింట్లుంటాయి. సీట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈ సీట్లు రైలు రంగుకు మ్యాచ్ అయ్యేలా పసుపు, ఆరంజ్ రంగుల్లో ఉంటాయి. ప్రతి బోగీలో చిన్న పాంట్రీ, ఎల్ఈడీ లైట్లు, మాడ్యులర్ టాయిలెట్లు, మోటార్ ఆపరేటెడ్ కర్టెన్లతో కూడిన స్మార్ట్ విండోస్ ఉంటాయి.
ఈ రైలు కోచ్ లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయని, మొత్తం 23 బోగీలతో రైలు నడుస్తుందని అధికారులు వెల్లడించారు. కాగా, రైల్వేలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని, అందులో భాగంగానే ఈ పని చేస్తోందని విపక్షాలు విమర్శిస్తుంటే, ఆ శాఖ మంత్రి పీయుష్ గోయల్ సమాధానం ఇస్తూ, రైల్వేల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఇంతవరకూ లేవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.