Euthanasia: ఈ దుర్భర జీవితం మా వల్లకాదు...చనిపోయేందుకు అనుమతించండి : ప్రధానికి ఓ కుటుంబం లేఖ

  • వేరే మార్గం లేదంటూ వేడుకున్నబీహార్‌ వాసి
  • ముగ్గురు బిడ్డలూ ఒకే సమస్యతో కదల్లేని స్థితి
  • హారతి కర్పూరంలా ఆరిపోయిన ఆస్తి

కడుపు తీపికి పేద, ధనిక అంతరాలు ఉండవు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలే జీవితంగా భావిస్తారు. కానీ ఆ బిడ్డలే కంటిముందు నరకం అనుభవిస్తుంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో వారి వేదన ఎలావుంటుంది? ఓవైపు పేదరికం, మరోవైపు బిడ్డల దైన్యం చూసి తట్టుకోలోని బీహార్‌కు చెందిన ఓ కుటుంబం తాము చనిపోయేందుకు అనుమతించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకే నేరుగా లేఖ రాయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని  రోహ్‌తాస్‌ జిల్లా చుల్కార్‌ గ్రామానికి చెందిన దేవమునిసింగ్‌యాదవ్‌ సాధారణ కుటుంబీకుడు. ఇతనికి భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. 2012 వరకు ఈ కుటుంబం సంతోషసాగరంలో ఓలలాడింది. అప్పటి వరకు హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో తొలిసారి అలజడి రేగింది.

దేవముని పెద్దకొడుకు మన్‌తోష్‌ (14) హఠాత్తుగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. అంతుచిక్కని నరాల వ్యాధితో అతను బాధపడుతున్నాడని వైద్యులు తెలియజేయడంతో హతాశులయ్యారు. ఉన్న ఆస్తిలో ఒక్కొక్కటీ అమ్ముతూ కొడుకు వైద్యం కోసం ఖర్చుచేస్తూ వచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆస్తి కరిగిపోయినా బిడ్డ ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయింది.

ఈ పరిస్థితుల్లో ఆరు నెలల క్రితం మరో పిడుగులాంటి వార్త వారిని కుదిపేసింది. దేవముని రెండో కొడుకు ధన్‌తోష్‌ అదే వ్యాధి బారిన పడ్డాడు. కొద్దిరోజులకు మూడో కుమారుడు రామ్‌తోష్‌ది అదే పరిస్థితి. ముగ్గురు కొడుకులు ఒకేలాంటి వ్యాధితో మంచం పట్టడంతో ఆ కుటుంబం వేదన వర్ణనాతీతం. ఓ వైపు వైద్యానికి దేవముని ఆస్తి మొత్తం కరిగిపోయింది. మరోవైపు బిడ్డలు ముగ్గురికీ తామే అన్నీ అయి సేవందించాల్సిన దుస్థితి.

పరిస్థితి తెలిసి బంధువులు కూడా ముఖం చాటేశారు. స్థానిక అధికారుల సాయం కోరినా వారూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లినా స్పందన కరువయింది. ఓ పాత్రికేయుడి మానవతా సాయం పుణ్యాన ప్రభుత్వం నుంచి నెలకు రూ.400 పింఛన్‌, 5 కేజీల బియ్యం అందుతున్నాయి. ప్రస్తుతం ఇదే ఆ కుటుంబానికి ఆధారం.

దుర్బర దారిద్య్రానికి తోడు బిడ్డల అనారోగ్యంతో ఆ కుటుంబం కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రకు దూరమై చాలారోజులే అయ్యింది. ఈ దుస్థితిలో బతకడం తమ వల్ల కాదని, తాము చనిపోయేందుకు అనుమతించాలంటూ దేవమునిసింగ్‌యాదవ్‌ ప్రధానికే నేరుగా లేఖ రాశారు.

  • Loading...

More Telugu News