Andhra Pradesh: లోకేశ్.. కావాలంటే గ్రామ వాలంటీర్ పోస్టుకు దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా!: విజయసాయిరెడ్డి
- ఏపీలో ఉత్తుత్తి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్న లోకేశ్
- టీడీపీ విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- దోచుకోవడం, దాచుకోవడాన్ని టీడీపీ వ్యవస్థీకృతం చేసిందని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఇంటర్వ్యూలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థలు ఉన్నట్లే గ్రామ వాలంటీర్ పోస్టులకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విమర్శలను వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ చంద్రబాబు, లోకేశ్ డ్రామాలు చేయడం ఆపాలని హితవు పలికారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా’ అని చురకలు అంటించారు.
అలాగే రాజధానికి బడ్జెట్ కేటాయింపులపై టీడీపీ నేతలు విమర్శించడంపై స్పందిస్తూ.. ‘అమరావతి శంకుస్థాపనకే రూ.300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో రూ.500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్లకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి?’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నిలదీశారు.