Karnataka: జీవితాన్ని మార్చేసిన ఐడియా... కాకిని పెంచుకుంటూ రోజుకు వేలు సంపాదిస్తున్న యువకుడు!
- పిండాలను తినేందుకు కాకుల కరవు
- కాకిని పెంచుకుంటూ రోజుకు 2 వేలు సంపాదిస్తున్న ప్రశాంత్ పుజారి
- డిమాండ్ పెరిగి ముందస్తు బుకింగ్స్ కూడా
'ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది' అనేది ఈ యువకుడి జీవితంలో నిజమైంది. కర్ణాటకలో ఓ కాకిని పెంచుకుంటున్న యువకుడు, రోజుకు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకూ సంపాదిస్తున్నాడు. ఇంతకూ అతను చేసే వ్యాపారం ఏంటో తెలుసా? కాకి కావాలంటూ తనను సంప్రదించిన వారి వద్దకు దాన్ని తీసుకెళ్లి, పిండాలను తినిపించడమే. హిందూ సంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే, పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారన్న సంగతి తెలిసిందే.
ఇక పట్టణాలు, నగరాల్లో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా, కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే కరావళి ప్రాంతంలోని ప్రశాంత్ పూజారి అనే యువకుడిలో కొత్త ఆలోచన రేకెత్తేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి, ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఒక్కసారిగా అతని తలరాత మారిపోయింది. కాకికి డిమాండ్ పెరిగి, ముందస్తు బుకింగ్ లు కూడా వస్తున్నాయి.
తన ఇంటి ముందున్న చెట్టుపై నుంచి పడిపోయిన మూడు కాకి పిల్లల్లో ఓ కాకి పిల్ల మాత్రమే బతికిందని, దానికి తాను రాజు అని పేరు పెట్టుకుని పెంచుతున్నానని ప్రశాంత్ పూజారి వెల్లడించాడు. తన వ్యాపారం పెరిగి రోజుకు రూ. 2 వేల వరకూ సంపాదిస్తున్నానని, తానేమీ డబ్బుకు డిమాండ్ చేయడం లేదని అంటున్నాడు.