nepal: నేపాల్ లో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. 43 మంది మృతి
- నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు
- 24 మంది ఆచూకీ గల్లంతు
- రానున్న రోజుల్లో వంద మిల్లీ మీటర్ల వర్షం పడే అవకాశం
భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం అవుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆ దేశంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైంది. వరదల ధాటికి కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి.
గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాబోయే రోజుల్లో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు నేపాల్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది.