Madhurai: మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో బయటపడ్డ రహస్య సొరంగం... భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయంటున్న స్థానికులు!
- పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు
- బయటపడిన మండపం
- దాన్ని ఆనుకుని ఓ రహస్య సొరంగం
- పనులు నిలిపివేసిన అధికారులు
తమిళనాడులోని ప్రఖ్యాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఓ రహస్య సొరంగం బయటపడింది. ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అనుకుని పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా, పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
ఈ మార్గం ఆలయం లోపలి నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎంతవరకూ వెళ్లిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెబుతున్నారు. సొరంగం బయట పడటంతో తవ్వకాలను నిలిపివేసిన అధికారులు, విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో ఉన్నారు.