Ram Nath Kovind: రాత్రంతా నిద్రపోని రాష్ట్రపతి కోవింద్... ఢిల్లీకి తిరుగు ప్రయాణం!

  • నిన్న మధ్యాహ్నం శ్రీహరికోటకు కోవింద్
  • రాత్రి ఒకటిన్నర సమయంలో వాయిదాపై విషయం చేరివేత
  • కోవింద్ కు వీడ్కోలు పలికేందుకు రేణిగుంటకు జగన్

నిన్న మధ్యాహ్నం చంద్రయాన్-2 ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించాలన్న కోరికతో శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబం ఈ ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరిగి న్యూఢిల్లీకి బయలుదేరింది. గత రాత్రి 2 గంటల సమయంలో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు దాదాపు గంట ముందువరకూ ప్రయోగం వాయిదా పడుతుందన్న సంగతి శాస్త్రవేత్తలెవరికీ తెలియదు.

సాయంత్రానికి శ్రీహరికోటకు చేరుకున్న కోవింద్ కు, అక్కడి సైంటిస్టులు ప్రయోగం గురించిన వివరాలను తెలియజేశారు. ఆపై రాత్రి భోజనం అనంతరం రాష్ట్రపతి మేలుకునే ఉండి తనను కలిసిన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నారు. రాత్రి ఒకటిన్నర తరువాత ప్రయోగంలో సాంకేతిక సమస్య ఉందన్న విషయం కోవింద్ కు చేరవేశారు. ఆ తరువాత కూడా దాదాపు గంటన్నర పాటు ఆయన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నట్టు సమాచారం.

రాత్రి రెండున్నర గంటలు దాటిన తరువాత తన గెస్ట్ హౌస్ కు వెళ్లిన ఆయన, సరిగ్గా నిద్రపోలేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. తిరిగి షెడ్యూల్ ప్రకారమే ఈ ఉదయం ఆయన రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం కాగా, వీడ్కోలు పలికేందుకు సీఎం వైఎస్ జగన్ రేణిగుంటకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News