Andhra Pradesh: పెట్టుబడిదారులకు అన్నిరకాలుగా సహకరిస్తాం: ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా
- రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తా
- పరిశ్రమల్లో స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తాం
- ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే బాగుండేది
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఈరోజు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ, ఇంతవరకూ ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా మహిళలు ఎవ్వరూ చేయలేదని, ఈ అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ పదవి చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నదని అన్నారు. తమ ప్రభుత్వం మహిళలను ఎంత గౌరవిస్తుందనడానికి తనకు దక్కిన ఈ పదవే నిదర్శనమని పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు అన్నిరకాలుగా సహకరిస్తామని, అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగానికి కృషి చేస్తామని చెప్పారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు పారదర్శకంగా భూముల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగేదని భావించిన రోజా, బడ్జెట్ లో పారిశ్రామికీకరణకు పెద్దపీట వేశారని కొనియాడారు.