Anurag: తల్లిదండ్రులు దైవ దర్శనానికి వెళ్లగా.. గ్యాస్ లీక్ చేసుకుని కొడుకు ఆత్మహత్య
- బంధువులకు సమాచారమందించిన పొరుగింటి వారు
- బంధువులు చూసేసరికి విగతజీవిగా యువకుడు
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గ్యాస్ లీక్ చేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, యాదవ్ నగర్ కాలనీ రోడ్డు నంబర్-3లోని అపార్ట్మెంట్లో నివాసముంటున్న నరేంద్రపాల్రెడ్డి న్యాయవాదిగా పని చేస్తున్నారు. నరేంద్రపాల్ దంపతులు దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లగా, ఆయన కుమారుడు అనురాగ్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేడు ఇంట్లో ఒక్కడే ఉన్న అనురాగ్, తల చుట్టూ గట్టిగా ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, గ్యాస్ పైపును నోట్లో పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పక్కింటి వారికి గ్యాస్ వాసన రావడంతో వారు అనురాగ్ బంధువులకు సమచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా, అనురాగ్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు, అనురాగ్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనురాగ్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.