Uttar Pradesh: కిడ్నాపైన యువతిని రక్షించి, తిరిగి వారికే అప్పగించిన పోలీసులు!
- అనూహ్య మలుపు తిరిగిన కిడ్నాప్ కేసు
- తమ బిడ్డకు మైనారిటీ తీరలేదన్న కుటుంబీకులు
- దీంతో యువతిని వారికే అప్పగించిన పోలీసులు
యూపీలోని అలహాబాద్ హైకోర్టు ముందు జరిగిన ఓ కిడ్నాప్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి, భర్తకు, తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించేందుకు రాగా, ఆమె కుటుంబీకులే ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు, వారి బారినుంచి ఆమెను కాపాడారు. అంతవరకూ బాగానే ఉంది. తరువాత మళ్లీ ఆమెను కుటుంబ సభ్యులకే అప్పగించడం ఇక్కడ కొసమెరుపు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, మత్లూబ్ అహ్మద్ అనే వ్యక్తి కుమార్తె, 11వ తేదీన తాను ఇష్టపడిన యువకుడితో కలిసి పారిపోయింది. ఆపై ఆమె హైకోర్టు వద్దకు రాగా, కోర్టు ప్రాంగణంలోనే యువతి కుటుంబీకులు కొందరు ఆ జంటను కిడ్నాప్ చేయగా, వెంటనే పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గాలించి, వారిని కాపాడి, కిడ్నాపర్లపై కేసు పెట్టారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. తమ బిడ్డకు మైనారిటీ తీరలేదని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో ఆమెను తిరిగి వారికే అప్పగించామని పోలీసులు తెలిపారు. కాగా, మత్లూబ్ అహ్మద్ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రగతి శీల్ సమాజ్వాది పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.