Jagan: ఆధారాలు బయటపెట్టేసరికి జగన్ ప్లేటు ఫిరాయించారు: చంద్రబాబు
- విమర్శలకే సభా సమయాన్నంతా వృథా చేస్తున్నారు
- పోలవరంకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం చేత కావడం లేదు
- పీపీఏలపై బురద చల్లాలనుకుని అభాసుపాలయ్యారు
ముఖ్యమంత్రి జగన్, వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంపై విమర్శలకే సభా సమయాన్నంతా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలతో సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో పోలవరం పనులను కూడా దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయని... కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవడం చేతకాక... టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ వ్యూహకమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం చివరకు అభాసుపాలయిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదని జగన్ అన్నారని... చివరకు ఆధారాలను బయటపెట్టేసరికి ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. వైయస్ వల్ల కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందని మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.