Bigboss 3: బిగ్ బాస్ పై హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్.. ప్రతివాదిగా నాగార్జున!
- వివాదాస్పదమవుతున్న బిగ్ బాస్ 3
- కేస్టింగ్ కౌచ్ ఉందంటూ కేసులు పెట్టిన గాయత్రి, శ్వేతారెడ్డి
- ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలని హైకోర్టులో కేతిరెడ్డి పిల్
తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అయితే, ఆది నుంచే ఈ షో వివాదాస్పదమవుతోంది. బిగ్ బాస్ లో కేస్టింగ్ కౌచ్ ఉందంటూ సినీనటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా ఈ షోపై కేసు నమోదైంది.
మరోవైపు సినీ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజాన్ని వేశారు. సినిమాల మాదిరే బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలని పిటిషన్ లో కోరారు. రాత్రి 11 గంటల తర్వాతే ప్రసారం చేసేలా ఆదేశించాలని విన్నవించారు. నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు.
మరోపక్క, బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసింది.