Saravan Bhavan: మరింత విషమించిన శరవణ భవన్ రాజగోపాల్ ఆరోగ్యం.. ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
- హత్య కేసులో రాజగోపాల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
- గుండెపోటు రావడంతో స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
- మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
చెన్నై శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జ్యోతిష్యుల సలహాపై మూడో పెళ్లి చేసుకునే ప్రయత్నంలో తన వద్ద పనిచేసే శాంతకుమార్ భార్యను వివాహమాడడానికి, అతనిని హత్య చేయించిన కేసులో రాజగోపాల్‌కు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కోర్టులో లొంగిపోవడానికి మునుపే అనారోగ్యంతో ఉన్నారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ఆయనను పుళల్ జైలుకు తరలించారు.
రాజగోపాల్‌కు ఈనెల 13న గుండెపోటు రావడంతో స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. నేడు రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తరుపు న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం చికిత్సకు అవసరమైన ఖర్చులు పిటిషనరే భరించాలని వెల్లడిస్తూ రాజగోపాల్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిచ్చింది.