krishnapatnam port: 11 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణపట్నం పోర్టు.. దక్షిణాసియాలోనే అత్యుత్తమ సాంకేతిక పోర్టుగా రికార్డు
- జాతికి అంకితమిచ్చి నేటికి 11 ఏళ్లు
- అతిపెద్ద నౌకల నిర్వహణకు అనువుగా 16 బెర్తులు
- దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు గేట్‌వే
ఏపీలోని ప్రతిష్ఠాత్మక కృష్ణపట్నం పోర్టును జాతికి అంకితమిచ్చి నేటికి సరిగ్గా పదకొండేళ్లు. ఈ 11 ఏళ్లలో పోర్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. దక్షిణాసియాలోనే అత్యుత్తమ సాంకేతిక పోర్టుగా రికార్డులకెక్కింది. దేశంలోనే డీపెస్ట్ వాటర్ పోర్టుగా ఖ్యాతిగాంచిన కృష్ణపట్నంలో అతిపెద్ద నౌకల నిర్వహణకు అనువుగా 16 బెర్తులు ఉన్నాయి. అంతేకాక 15 మిలియన్ టన్నుల కార్గోను నిల్వచేసేందుకు వీలుగా 11 పెద్దపెద్ద గోదాములు ఉన్నాయి. పోర్టును పూర్తిస్థాయి కంటైనర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు నవయుగ సంస్థ కృషి చేస్తోంది. 42 బెర్తులతో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన పోర్టుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కృష్ణపట్నం-ఓబులవారి పల్లె రైల్వే లైను నిర్మాణం కూడా ఇటీవలే పూర్తయింది. ఈ మార్గం గుండా ఇప్పటికే సరుకుల రవాణాను కూడా ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టును దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు గేట్వేగా తీర్చిదిద్దేందుకు పోర్టు యాజమాన్యం కృషి చేస్తోంది.