Vistara: విమానంలో పది నిమిషాల ఇంధనం మాత్రమే... గట్టెక్కిన 153 మంది ప్రాణాలు!
- అత్యవసరంగా లక్నోలో దిగిన విస్తార ఎ-320 విమానం
- ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తోన్న విమానం
- 153 మంది ప్రయాణికులు సురక్షితం
- లక్నోలో ఇంధనం నింపుకున్నాక రాజధానికి పయనం
ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తార విమానం ఎ-320 బుధవారం అత్యవసరంగా లక్నో విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో 153 మంది ప్రయాణికులున్నారు. విమానం ఢిల్లీ చేరుకున్నప్పటికీ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్లకు ముందు దారి కనిపించలేదు. దీంతో అక్కడే చాలాసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సివచ్చింది. ఇక అక్కడ ల్యాండ్ అవడం కష్టమని భావించిన పైలెట్లు ఏటీసీని సంప్రదించి, లక్నోలో ల్యాండ్ అవడానికి ప్రయత్నించారు. అక్కడ కూడా వాతావరణం బాగుండకపోవడంతో కాన్పూర్ లేదా ప్రయాగ్ రాజ్ కు మళ్లించాలని భావించారు. అయితే తిరిగి లక్నోలో వాతావరణం మెరుగవ్వడంతో చివరికి అక్కడికే విమానాన్ని మళ్లించారు.
విమానం లక్నో పరిసరాల్లోకి చేరుకునే సరికే అందులో సుమారు 300 కేజీల ఇంధనం మాత్రమే మిగిలింది. వాస్తవానికి ఇంధనం అధికంగానే నింపుకుని వెళ్లినప్పటికీ, ఢిల్లీ వెళ్లడం.. అక్కడ చాలాసేపు చక్కర్లు కొట్టడం వల్ల ఇంధనం అయిపోవచ్చింది. దీంతో పైలట్లు ‘ఫ్యూయల్ మేడే’ ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన పైలట్లు చివరకు సురక్షితంగా విమానాన్ని లక్నో విమానాశ్రయంలో దించారు. అయితే విమానయాన అధికారులు ఢిల్లీలో ఈ విమానం దిగేందుకు వాతావరణం సరిగ్గా లేనందున లక్నోకు మళ్లించినట్లు తెలిపారు. విశేషం ఏమిటంటే, లక్నో చేరేటప్పటికి ఇక పది నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో వుంది!