USA: అమెరికాలో నాజీ ఉన్మాది కిరాతకం.. 419 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!
- వర్జీనియాలోని చార్లొట్ విల్లేలో ఘటన
- జనరల్ ఈలీ విగ్రహం తొలగింపునకు నిరసనగా ర్యాలీ
- ఆందోళనకారులను కారుతో తొక్కించిన జేమ్స్
అమెరికా అంతర్యుద్ధం సందర్భంగా బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా పోరాడిన జనరల్ రాబర్ట్ ఈలీ విగ్రహాన్ని తొలగించాలని అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం చార్లొట్ విల్లే నగర పాలకులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ శ్వేతజాతీయులు ర్యాలీ నిర్వహించగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జేమ్స్ అలెక్స్(32) అనే నాజీ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తి ఆందోళనకారులను తన కారుతో ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో హెదర్ హెయిర్ అనే యువతి ప్రాణాలు కోల్పోగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా ఈ కేసును విచారించిన ఓ న్యాయస్థానం జేమ్స్ అలెక్స్ కు యావజ్జీవంతో పాటు 419 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అమెరికాలో బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా పోరాడిన జనరల్ రాబర్ట్ ఈలీని శ్వేత జాత్యహంకారులు హీరోగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా శ్వేతజాతీయులు ఉద్యమించారు. మరోపక్క విగ్రహాన్ని తొలగించాలని మరికొందరు ఆందోళన చేశారు. ఇది జేమ్స్ కు ఆగ్రహం తెప్పించింది. 2017 ఆగష్టు 12న జరిగిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు.. యావజ్జీవంతో పాటు 419 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.