Andhra Pradesh: ఆనాడు ఎన్టీ రామారావు అసెంబ్లీ నుంచి ఏడుస్తూ వెళ్లేలా చంద్రబాబు చేశారు!: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- ఆయనే ఇప్పుడు సభాసంప్రదాయాలు అంటున్నారు
- బుచ్చయ్య, అచ్చెన్న నంగనాచుల్లా మాట్లాడుతున్నారు
- అసెంబ్లీ మీడియా పాయింట్ లో టీడీపీ పై రోజా ఆగ్రహం
సభా సంప్రదాయాలను గౌరవించాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. ‘ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీనీ, పదవిని లాక్కుని, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అసెంబ్లీ నుంచి ఆయన ఏడుస్తూ వెళ్లేవిధంగా చేసిన మీరా సభాసంప్రదాయాల గురించి మాట్లాడేది? స్పీకర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టేందుకు లేచి రావాలని తెలిసినా రాని అహంకారి చంద్రబాబు.
ఇలాంటి వ్యక్తి సభాసంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు అచ్చెన్నాయుడు కానీ, బుచ్చయ్య చౌదరి కానీ ఏమీ తెలియని నంగనాచుల్లాగా మాట్లాడుతున్నారు. గత 8 రోజుల రికార్డులు చూసుకోవాలని చెబుతున్నారు. కేవలం 8 రోజులే ఎందుకు? గత ఐదేళ్ల రికార్డులు చూద్దాం’ అని వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడు గతంలో జగన్ ను ‘నువ్వు మగాడివా? నీలో రాయలసీమ రక్తం ఉందా?’ అనే భాష మాట్లాడారనీ, ఆయన తీరును చూసి ఏపీ ప్రజలంతా అసహ్యించుకున్నారనీ, ఇప్పుడు ఆయనే నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఛీకొట్టారనీ, 23 స్థానాలు ఇచ్చారని రోజా విమర్శించారు. దీంతో ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఏం చేయాలో అర్థంకాక ప్రతీదానికి గొడవ చేస్తూ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ బడ్జెట్ పై చర్చ జరిగితే చంద్రబాబును రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటారని స్పష్టం చేశారు. చిన్న వయసైనా సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కానీ చంద్రబాబు బడ్జెట్ పై మాట్లాడలేక బుచ్చయ్య చౌదరికి మైక్ ఇచ్చి రూమ్ లోకి వెళ్లిపోయారని దుయ్యబట్టారు.