Keleshwaram: 'హైదరాబాదుకు నీటి కొరత' అంశంపై సినీ దర్శకుడు మారుతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్!
- 48 రోజుల తరువాత నీటి కష్టాలంటూ కథనం
- అటువంటిదేమీ లేదన్న కేటీఆర్
- కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీరందుతుందని భరోసా
హైదరాబాద్ కు మరో 48 రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరుందని, ఆపై కష్టాలు తప్పవని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ప్రస్తావిస్తూ, దర్శకుడు మారుతి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇది నిజమేనా? అని మారుతి అడుగగా, ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చిన కేటీఆర్, అలాంటేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్ కచ్చితమైనది కాదన్నారు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుందని, దీంతో హైదరాబాద్ కు 175 ఎంజీడీల నీరు అందుతుందని, తాగునీటి సమస్య చోటుచేసుకోదని తెలిపారు. ఇదే సమయంలో నగర పౌరులంతా, నీటి పొదుపు, హార్వెస్టింగ్ ల ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ఇక కేటీఆర్ సమాధానంపై సంతృప్తి చెందిన మారుతి, శుభవార్త చెప్పారంటూ ధన్యవాదాలు తెలియజేశారు.