Andhra Pradesh: తనను ప్రశ్నించిన నలుగురు ముస్లిం యువకులపై చంద్రబాబు దేశద్రోహం కేసు పెట్టించారు!: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
- 2018లో ముస్లింల ఆత్మీయ సదస్సును నిర్వహించారు
- ప్రశ్నించిన యువకులను పోలీసులతో కొట్టించారు
- అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీకి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎన్నికల ముందే గుర్తుకు వస్తారని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. 2018లో ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో మైనారిటీల ఆత్మీయ సదస్సు పెట్టారని గుర్తుచేశారు. ఈరోజు అసెంబ్లీలో పార్థసారథి మాట్లాడుతూ.. ‘మామూలుగా ఏ పార్టీ సమావేశం పెట్టుకున్నా ఆ పార్టీ కార్యకర్తలు పోతారు. ఆహా.. ఓహో అని జిందాబాదులు కొడతారు. ఇది మనకు తెలిసిందే అధ్యక్షా. కానీ ఈ సదస్సుకు నంద్యాల నుంచి కొందరు యువకులు వచ్చారు.
అప్పటి సీఎం చంద్రబాబు చెప్పినదంతా విన్నారు. చివరికి లేచి నిలబడి.. ముఖ్యమంత్రి(చంద్రబాబు) గారూ.. నాలుగు సంవత్సరాలు గడుస్తోంది. ఒక్క మైనారిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడైనా ఇలా జరిగిందా? మైనారిటీ లేని కేబినెట్ ఎప్పుడైనా ఉందా? మౌజన్, ఇమామ్ లకు జీతాలు పెంచుతామన్నారు. ఇంతవరకూ పెంచలేదు అని అడిగారు. కానీ చంద్రబాబు ఏం చేశారు అధ్యక్షా.. ఇప్పుడు ఇవ్వలేకపోయా.
తర్వాత ఇస్తా అని చెప్పాలి. కానీ ఏం చేశారో తెలుసా అధ్యక్షా.. మీ తొక కత్తిరిస్తా.. మీ తోలు తీస్తా అని బెదిరించి ఏం చేశారో తెలుసా అధ్యక్షా.. నలుగురు ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టారు అధ్యక్షా. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడికి వచ్చారని కేసు పెట్టారు.
నలుగురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టి జైలులో పడేశారు. మా ప్రభుత్వం ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం పెంచింది. మైనారిటీలకు రూ.2,106 కోట్లను బడ్జెట్ లో కేటాయించామంటే మా నాయకుడి కమిట్ మెంట్ ఇది’ అని వ్యాఖ్యానించారు.