TTD: టీటీడీ చైర్మన్ కార్యాలయాన్ని తాడేపల్లికి మార్చడంలేదు: వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ చైర్మన్ ఆఫీసును తిరుపతి నుంచి తరలిస్తున్నారంటూ ప్రచారం
- స్పందించిన టీటీడీ నూతన చైర్మన్
- విజయవాడ టీటీడీ సమాచార కేంద్రాన్ని అమరావతికి మార్చుతున్నామంటూ వివరణ
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కూడా కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇప్పటికే టీటీడీ బోర్డుకు వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమించారు. వైవీ వచ్చీరావడంతోనే తిరుమల వ్యవహారాల్లో తనదైన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. గత చైర్మన్లకు భిన్నంగా టీటీడీ చైర్మన్ కార్యాలయాన్ని తిరుపతి నుంచి తాడేపల్లికి మారుస్తున్నారంటూ ప్రచారం జరిగింది. సీఎం జగన్ కు దగ్గరగా ఉండేందుకే తాడేపల్లిలో టీటీడీ కార్యాలయం ఏర్పాటు అంటూ కథనాలు వచ్చాయి.
దీనిపై వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. తాడేపల్లిలో టీటీడీ చైర్మన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. టీటీడీ చైర్మన్ కార్యాలయం యథాతథంగానే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, విజయవాడలో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాన్ని అమరావతికి మార్చుతున్నట్టు వెల్లడించారు. ఇక, పాలనాపరమైన నిర్ణయాలను కూడా వైవీ వివరించారు.
ఇప్పటికే ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయం నేటి నుంచి అమలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే, వీఐపీల మర్యాదకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వీఐపీ దర్శనాల సంఖ్యను నిర్ణయించేలా కొత్త విధానం తీసుకువస్తున్నట్టు చెప్పారు. బ్రేక్ దర్శనాల్లో అక్రమాల నివారణ కోసమే కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు వివరించారు.