Andhra Pradesh: అచ్చెన్నాయుడు పనికోసం వచ్చిన ఓ దళిత మహిళను బూటు కాలితో తన్నాడు!: ఎమ్మెల్యే మేరుగు నాగార్జున
- జగన్ దళితులను గుండెల్లో పెట్టుకున్నారు
- అందుకు అనుగుణంగానే బడ్జెట్ కేటాయించారు
- అసెంబ్లీలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దళితులను, గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారనీ, అందుకు అనుగుణంగానే బడ్జెట్ లో కేటాయింపులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తెలిపారు. కానీ ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఈ మాట అన్నందుకు ఆయన సిగ్గుపడాలనీ, ఆయనకు అసెంబ్లీలో కూర్చునే అర్హతే లేదని దుయ్యబట్టారు. తనలాంటి వాళ్లు దళిత కులంలోనే మళ్లీమళ్లీ పుట్టాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు మేరుగు నాగార్జున మాట్లాడారు.
‘మామీద జరిగిన దాడులు అనేకం అధ్యక్షా. గగరపురంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టమని అడిగితే, వెలివేశారు. చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలుస్తున్న మా కులస్తులపై దాడి చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడలేదు. పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేస్తే కనీసం మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ ప్రతీదానికి అచ్చెన్నాయుడు లేస్తున్నాడు. ఓ ఎస్సీ మహిళ నీ దగ్గర పనికి వస్తే బూటు కాలితో తన్నావే? నువ్వా ఈరోజు మాట్లాడేది? నీకు సిగ్గులేదు. ఇలాంటి అవమానాలు కోకొల్లలుగా జరిగాయి’ అని నాగార్జున మండిపడ్డారు.