Karnataka: రేపటితో కర్ణాటకలో ‘సంకీర్ణం’ కథ ముగుస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్
- రేపు విశ్వాసపరీక్ష ఎదుర్కోనున్న సంకీర్ణ ప్రభుత్వం
- సంఖ్యా బలం లేకున్నా సీఎంగా కుమారస్వామి కొనసాగడం తగదు
- కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది
కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రేపు విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రేపటితో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కథ ముగుస్తుందని, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి ప్రభుత్వం సంఖ్యా బలాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. సిగ్గూలజ్జా లేకుండా సీఎం పదవిలో కుమారస్వామి ఇంకా కొనసాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షకు వెళ్లాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. రెబెల్ ఎమ్యెల్యేలపై ఎటువంటి నిబంధనలను జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తీసుకురాలేవన్న విషయాన్నీ అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని అన్నారు. రేపటి విశ్వాసపరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పిన జీవీఎల్, బలనిరూపణకు ముందుగానే సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.