K.V.R. Mahendra: కో డైరెక్టర్ గా వున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను అవమానపరిచాడు: 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర
- నేను యాక్ట్ చేసి చూపించడం ఆ నటుడికి నచ్చలేదు
- అది మనసులో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాడు
- అవమానం తట్టుకోలేక ఏడుపొచ్చిందన్న మహేంద్ర
ఇటీవల వచ్చిన 'దొరసాని' సినిమాకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. దర్శకుడిగా కేవీఆర్ మహేంద్రకి మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు.
" కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేశాను. కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరున్న ఒక ఆర్టిస్టు ఆ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. దర్శకుడి సూచన మేరకు నేను ఆ హీరోకి సీన్ చేసి చూపించాను. 'నాకు యాక్ట్ చేసి చూపిస్తావా?' అని అతను లోపల రగిలిపోతున్న విషయం నాకు తెలియదు. ఆ తరువాత ఒక చిన్న ఆర్టిస్టు రాకపోవడంతో, ఆ హీరో కాంబినేషన్లో నేనే ఆ పాత్ర చేయవలసి వచ్చింది. నా చొక్కా పట్టుకునే ఆ షాట్ ను ఆ హీరో కావాలని పదే పదే చేస్తూ, నా వల్లనే ఎక్కువ టేకులు అవుతున్నట్టుగా అవమానపరిచాడు. ఆయన అలా ఎందుకు చేస్తున్నదీ మా టీమ్ కి అర్థమైపోయింది. కానీ ఆయనను ఏమీ అనలేక నాకు ఏడుపొచ్చేసింది" అని చెప్పుకొచ్చాడు.