Jason Roy: వరల్డ్ కప్ పుణ్యమా అని ప్రమోషన్ కొట్టేసిన ఇంగ్లాండ్ ఓపెనర్
- వరల్డ్ కప్ లో 443 పరుగులు సాధించిన జాసన్ రాయ్
- ఐర్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం రాయ్ ని ఎంపిక చేసిన ఇంగ్లాండ్ సెలక్టర్లు
- యాషెస్ కు సన్నాహకంగా ఐర్లాండ్ తో టెస్టు సిరీస్
సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ టోర్నీ ఇంగ్లాండ్ జట్టుకు చిరస్మరణీయం, మధురజ్ఞాపకం అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఆ జట్టు విజయాల్లో ప్రధాన భూమిక ఓపెనర్ జాసన్ రాయ్ దేనని చెప్పాలి. 28 ఏళ్ల రాయ్ వరల్డ్ కప్ లో తన విధ్వంసక బ్యాటింగ్ తో 443 పరుగులు సాధించాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ వన్డే టీమ్ లో రెగ్యులర్ ఆటగాడైన రాయ్ ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే వరల్డ్ కప్ లో చూపిన అద్వితీయమైన ప్రతిభ అతడికి టెస్టు అవకాశం తెచ్చిపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఐర్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఇంగ్లీష్ సెలక్టర్లు జాసన్ రాయ్ ను కూడా ఎంపిక చేశారు. ఐర్లాండ్ తో సిరీస్ లో రాణిస్తే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలుంటాయి. ఐర్లాండ్ తో టెస్టు సిరీస్ ను యాషెస్ కు సన్నాహకంగా భావిస్తున్నారు.