Pakistan: పాకిస్థాన్ ఒక అనాగరిక దేశం.. ఆ దేశ ఆర్మీ పనికిమాలినది: ముకుల్ రోహత్గి
- పాక్ సైన్యం పనికిమాలిన చర్యలను ప్రపంచమంతా చూసింది
- పాక్ చెబుతున్నదంతా అబద్ధమనే విషయం అందరికీ అర్థమైంది
- జాధవ్ ను ఇండియాకు పంపించాలని ఐసీజే చెప్పింది
పాకిస్థాన్ పై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఒక అనాగరిక దేశమని చెప్పారు. ఆ దేశ ఆర్మీ పనికిమాలినదని, మోసకారి అని విమర్శించారు. కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించిన తర్వాత ఆయన ఈ మేరకు స్పందించారు.
'అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జడ్జిలు ఉంటారు. వీరిలో చైనా జడ్జి కూడా ఉన్నారు. పాకిస్థాన్ నాగరిక దేశం కాదు. ఆ దేశ సైన్యం చేస్తున్న పనికిమాలిన చర్యలను ప్రపంచమంతా చూసింది. జాధవ్ శిక్షను పున:సమీక్షించాలని, ఆయనను భారత్ కు పంపించేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. పాకిస్థాన్ చెబుతున్నదంతా అబద్ధమనే విషయం ప్రపంచానికి అర్థమైంది' అని జాధవ్ అన్నారు.
గూఢచర్యం ఆరోపణలతో 2017 ఏప్రిల్ 11న పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాధవ్ కు మరణశిక్షను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాకిస్థాన్ లోని జైల్లో ఉన్నారు.