Andhra Pradesh: ఏదో 100 మంది చనిపోయినట్లు చంద్రబాబు అర్ధరాత్రి హైకోర్టుకు వెళ్లారు!: బొత్స సత్యనారాయణ
- ఏపీలో నిర్మాణలపై 2007లోనే చట్టం తెచ్చాం
- టీడీపీ హయాంలో 15,300 అక్రమ కట్టడాలు కూల్చేశారు
- అసెంబ్లీలో మాట్లాడిన ఏపీ మున్సిపల్ మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో భవనాలు, భవంతుల నిర్మాణంపై 2007లో ఓ చట్టం తీసుకొచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిప్రకారం కాలువలు, వాగుల వెడల్పు 10 మీటర్లు ఉంటే 2 మీటర్లు బఫర్ జోన్ వదలాలని చెప్పారు.10 మీటర్లు పైన ఉంటే 9 మీటర్లు బఫర్ జోన్ ఇవ్వాలని అన్నారు. ఇక నదుల పక్కన కట్టడాలు కడితే 50 మీటర్లు బఫర్ జోన్ ఉండాలని వెల్లడించారు. అదే చెరువుల పక్కన కట్టడాలు కడితే 30 మీటర్లు బఫర్ జోన్ ఉండాలన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని బొత్స పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో 15,300 అక్రమ కట్టడాలను తొలగించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు చంద్రబాబుకు రాష్ట్రంలో నదులు, వాగులు, వంకల దగ్గరున్న ప్రజల గురించి బెంగ లేదనీ, తన ఇంటిపైనే బెంగ పట్టుకుందని వ్యాఖ్యానించారు. 2014లో సీఆర్డీఏ చట్టం తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అదే చట్టాన్ని ఉల్లంఘించిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క చంద్రబాబు నివాసానికే కాకుండా మరో 30 కట్టడాలకు కూడా నోటీసులు ఇచ్చామనీ, తమకు ఎవ్వరిపైనా కక్ష లేదని బొత్స స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా రాత్రి 2-3 గంటలకు ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ వేశారని మంత్రి చెప్పారు. ఏదో 100 మంది చనిపోయినట్లు, అర్ధరాత్రి దాటాక హౌస్ మోషన్ మూవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడం అని తేలాక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ, ఇందులో ధనిక, పేద తేడాలు ఉండవని వ్యాఖ్యానించారు.