Andhra Pradesh: నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ.. అదే ప్రజావేదిక!: ఆళ్ల రామకృష్ణారెడ్డి
- చాలామంది పేదలు కాలువల పక్కన ఉంటున్నారు
- వీరిందరికీ ప్రభుత్వం పట్టాలివ్వబోతోంది
- అసెంబ్లీలో మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో చాలామంది పేదలు కాలువలపై చిన్నచిన్న ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఉగాది నాడు 25 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంచబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నదీపరీవాహక చట్టం ప్రకారం నదికి, కరకట్టకు మధ్య చిన్న మొక్క నాటడానికి కూడా వీల్లేదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్కే మాట్లాడారు.
కరకట్ట దగ్గరున్న 70 మందికి హైకోర్టు రెండుసార్లు నోటీసులు జారీచేసిందనీ, అయినా ఎవ్వరూ స్పందించలేదని రామకృష్ణారెడ్డి తెలిపారు. 2016, మార్చి 6న అప్పటి సీఎం చంద్రబాబు..‘లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వ భవనం. దానికి యజమానితో సంబంధం లేదు’ అని చెప్పారని గుర్తుచేశారు. ‘‘ప్రజలు ఓడించినా ‘మన పని అయిపోయింది. పక్కకు వెళ్లిపోదాం’ అనే జ్ఞానం కూడా లేకుండా ఇంకా నేను ఇక్కడే ఉంటా. నన్ను ఎవరు కదిలిస్తారు.. అంటూ కనీసం మనిషికున్న విలువ, విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాననీ, ఇప్పటికైనా చట్టానికి లోబడి చంద్రబాబు వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఇక ప్రజావేదికపై ఆర్కే మాట్లాడుతూ.. ‘రూ.2 కోట్ల అంచనా పనులు. అదీ నామినేషన్ పద్ధతి కింద అప్పగించారు. చివరికి అంచనాలు రూ.10 కోట్లకు చేరాయి. తీరా చూస్తే నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ.. అంతకుమించి ఏమీ లేదు అధ్యక్షా. అలాంటి అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం కూలిస్తే దాన్ని హర్షించాల్సిందిపోయి ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.