Amarnath: అమర్ నాథ్ యాత్రికులకు తెలుగు రుచులతో పసందైన భోజనం!
- 2011లో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ప్రారంభం
- 21 మందితో మొదలై 100 మంది సభ్యుల వరకు విస్తరణ
- దాతల సాయంతో నిర్విరామంగా భోజన కార్యక్రమం
ఉత్తరాదిన కొలువై ఉన్న అమర్ నాథ్ పుణ్యక్షేత్రం సందర్శనకు ఏటా వేలాదిమంది భక్తులు తరలి వెళుతుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం భోజన సదుపాయాలు ఉన్నా అక్కడ దొరికేవన్నీ ఉత్తరాదికి చెందిన వంటకాలే. దాంతో తెలుగు భక్తులు అరకొరగా తినాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యం నుంచి ఏర్పడిందే అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి.
2010లో తెలంగాణలోని సిద్ధిపేట నుంచి 45 తెలుగు కుటుంబాలు అమర్ నాథ్ యాత్రకు వెళ్లగా, అక్కడి బేస్ క్యాంపుల్లో తెలుగు భోజనం దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో, తమలాగా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని భావించి 2011లో 21 మంది తెలుగు వ్యక్తులు అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేసి తెలుగు రుచులతో కమ్మని భోజనం అందించడం మొదలుపెట్టారు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెలుగు భోజనాలు వండివారుస్తారు. పాలు, టీ నుంచి దోసె, ఊతప్పం, పూరీలు, ఇడ్లీలు, అన్నం, పప్పు, ఆవకాయ, పచ్చళ్లు, కూరలు, పెరుగు, అప్పడాలు, స్వీట్ల వరకు ఇక్కడి భోజనంలో నిత్యం వడ్డిస్తారు. బల్తాల్, పంచతరణి ప్రాంతాల్లో ఈ తెలుగు భోజన సేవలు అందిస్తున్నారు. 21 మందితో ప్రారంభమైన అమర్ నాథ్ అన్నదాన సేవా సమితిలో ప్రస్తుతం 100 మంది వరకు సభ్యులు ఉన్నారు. కొందరు దాతలు భారీ విరాళాలు అందిస్తుండడంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతోంది.