Andhra Pradesh: ఏపీ రాజధాని నిర్మాణానికి రుణాన్ని నిలిపివేసిన ప్రపంచబ్యాంక్
- గతంలో రూ.2100 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు నిర్ణయం
- తాజా పరిణామాల నేపథ్యంలో వెనుకంజ వేసిన వైనం!
- ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు రుణంపైనా అనుమానాలు!
ఏపీలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బలాంటి పరిణామం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2100 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు నిలిపివేసింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంపై ఆరోపణలు రాగా, ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా, ఆర్థికంగా అండదండలు అందించాలని నిర్ణయించింది.
అయితే, జగన్ సర్కారు వచ్చిన కొన్నిరోజుల్లోనే ప్రపంచబ్యాంకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రపంచబ్యాంకు వెనుకంజ నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాలపైనా అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో ఏడీబీ కూడా అదే బాటలో పయనిస్తుందని అంచనా వేస్తున్నారు.