Andhra Pradesh: ‘పీపీఏ’లపై సమీక్ష వద్దని కేంద్రం ఎందుకు చెప్పిందో జగన్ అర్థం చేసుకోవాలి!: యనమల రామకృష్ణుడు
- ఈ సూచనల్ని కాదని ముందుకుపోతే తప్పిదమే
- కేంద్రం ఆర్టికల్ 257 కింద చర్యలు తీసుకోవచ్చు
- దాని కింద రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చు
టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. పీపీఏలపై సమీక్ష చేపట్టవద్దని కేంద్రం ఎందుకు సూచించిందో సీఎం జగన్ అర్థం చేసుకోవాలని యనమల తెలిపారు.
ఒకవేళ ఈ సూచనలను కాదని ముందుకు వెళితే తీవ్ర తప్పిదమే అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను రాష్ట్రం పక్కన పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యనమల కొద్దిసేపు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఒకవేళ కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడితే, ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని గుర్తుచేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా కేంద్రానికి ఉందని యనమల రామకృష్ణుడు చెప్పారు. పీపీఏ ఒప్పందాలతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని టీడీపీ నేత వ్యాఖ్యానించారు.